Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా తన మార్క్ చూపిస్తారనడానికి రాజ్యసభలో ఇవాళ ఆయన ఇచ్చిన ఓ సూచన ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా చట్టసభల్లో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు తమ చేతుల్లో ఉన్న పత్రాలను టేబుల్ పై పెడుతూ ఐ బెగ్ యూ అనే పదం వాడతారు. అంటే ఈ పత్రం పరిశీలించాలని రాజ్యసభ చైర్మన్ కు విజ్ఞప్తి చేసే క్రమంలో సభ్యులు ఈ పదం వాడుతుంటారు. నిజానికి ఐ బెగ్ యూ అనే పదం వినడానికి అంత గౌరవప్రదంగా అనిపించదు. ఆ సందర్భంలో అలాంటి అర్ధం వచ్చే ఓ పదం ఉపయోగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ…ఐ బెగ్ యూ అని దీనంగా అడుగుతున్నట్టుగా ఉన్న పదం వాడాల్సిన పనిలేదు. కానీ చట్టసభల నియమావళి ప్రకారం అందరూ తమ పత్రాలను సమర్పిస్తూ ఐ బెగ్ యూ అంటుంటారు. గతంలో రాజ్యసభ చైర్మన్ గా పనిచేసిన వాళ్లెవరూ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేయలేదు. కానీ ప్రతి అంశాన్ని సూక్ష్మంగా, సున్నితంగా పరిశీలించే వెంకయ్యనాయుడుకు ఐ బెగ్ యూ అన్నపదం సరైనదిగా అనిపించలేదు. రాజ్యసభ సభ్యులు గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఐ బెగ్ యూ అనడం గమనించిన వెంకయ్య… శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన తొలిరోజే తన మనసులో మాట వెల్లడించారు.
శుక్రవారం సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వెంకయ్యనాయుడు చైర్మన్ గా రాజ్యసభలో అడుగుపెట్టగానే సంప్రదాయం ప్రకారం సభ్యులందరూ అభివాదం చేశారు. వారికి తిరిగి నమస్కారం చేస్తూ చైర్ లో కూర్చున్న వెంకయ్య సభ్యులందరినీ ఉద్దేశించి తాను ఓ సలహా చెప్పబోతున్నట్టు తెలిపారు. సభ్యులంతా తన టేబుల్ పై పత్రాలు ఉంచుతూ ఐ బెగ్ యూ అని అంటున్నారని, ఇకపై ఆ పదం వాడొద్దని వెంకయ్య సూచించారు. మనకు స్వాతంత్య్రం రాకముందు ఈ పదం వాడేవారని, ఇప్పుడు స్వతంత్ర భారతదేశం కనుక అలాంటి పదం వాడాల్సిన అవసరం లేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా ఐ రెయిజ్ టు లే ఆన్ ది టేబుల్ అన్న వాక్యాన్ని ఉపయోగించాలని సూచించారు. అయితే ఇది తన సలహా మాత్రమేనని, ఆదేశం కాదని వెంకయ్య స్పష్టంచేశారు. మరో సందర్భంలోనూ వెంకయ్య గత చైర్మన్ లతో పోలిస్తే భిన్నంగా వ్యవహరించారు. మృతిచెందిన సభ్యులకు రాజ్యసభలో సంతాపం ప్రకటించే సందర్భంలో వెంకయ్య కూడా సభ్యులతో పాటు లేచినిల్చున్నారు. గత చైర్మన్ లు హమీద్ అన్సారీ, భైరాంసింగ్ షెకావత్ ఇలాంటి సందర్బాల్లో సీట్లో కూర్చునే ఉండేవారు. మొత్తానికి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు.