Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంప్రదాయ చట్రాలు, వేళ్లూనుకున్న బూజుపట్టిన భావాల నుంచి దేశ మహిళలు ఇప్పుడిప్పుడే కాస్త ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అనే మాటలకు అర్ధం తెలుసుకుంటున్నారు. వాటికి వున్న శక్తిని ఆస్వాదిస్తున్నారు. ఆమె మెదడు పురుషుడు కన్నా చురుగ్గా పని చేస్తుందని, ఒక్కసారే రెండు పనులు చేయగల సామర్ధ్యం ఆమె సొంతం అని సైన్స్ నిరూపిస్తున్నా ఆ విషయాన్ని ఒప్పుకోడానికి ఇంకా కొందరు సిద్ధంగా లేరు. ఆ సిద్ధంగా లేని వ్యక్తులు ఏ పిచ్చి పుల్లయ్యో అయితే పర్వాలేదు. అది ఆ ఇంటికి మాత్రమే సమస్య. దేశాన్ని పాలించే వాళ్ళు, దేశం దశదిశ నిర్దేశించే స్థాయిలో వున్నవాళ్లు కూడా అలాగే ఆలోచిస్తే జరిగే నష్టం అపారం. ఆ నష్టాన్ని డబ్బు లెక్కలతో కొలవడం కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.
ఎప్పటి నుంచో వేళ్లూనుకున్న భావజాలం మారాలంటే కొన్ని తరాలు పడుతుంది. వందల వేల ఏళ్ళు ఖర్చు అవుతాయి. క్రమంగా వచ్చిన ఆ మార్పు ని ఒక్కసారిగా మళ్ళీ పాత పద్దతుల్లోకి తీసుకెళితే వేల సంవత్సరాల శ్రమ, అనుభవం వృధా అయిపోతుంది. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ద్రౌపది గురించి బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల వల్ల. ఆమెని మొట్టమొదటి స్త్రీవాదిగా అభివర్ణించిన ఆయన ఆమె ఎప్పుడూ భర్తల మాట వినలేదని, స్నేహితుడు కృష్ణుడు మాటలే విన్నదని చెప్పుకొచ్చారు. ఆమె పట్టుదలవల్లే మహాభారత యుద్ధం జరిగి 18 లక్షల మంది చనిపోయారని కూడా రామ్ మాధవ్ వ్యాఖ్య. ఆమెకు ఐదుగురు భర్తలు అన్న విషయాన్ని కూడా రామ్ మాధవ్ నొక్కినొక్కి చెప్పారు. ఇవన్నీ రామ్ మాధవ్ అభిప్రాయాలు అయితే ఓకే. అందరూ అలాగే ఆలోచించాలంటే మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలేవో మహామేధావులు , వేదం, పురాణాలు చదువుకున్నవాళ్ళు వేసినవి కాదు. అవి చదువుకున్నవాళ్ళు చెప్పినవి విని ఇన్నాళ్లు మంచి విషయాలు అని నమ్ముతున్నవాళ్ళు.
1 . ద్రౌపది కి ఐదుగురు భర్తలు వున్న మాట నిజమే. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసిందా లేక కుంతికి పాండవులు ఇచ్చిన మాట కోసం ఐదుగురితో పెళ్ళికి ఒప్పుకుందా ?
2 . కురుసభలో పాంచాలి కి జరిగిన అవమానం మాత్రమే మహాభారత యుద్ధానికి కారణమా ? అంతకుముందు కురుపాండవుల మధ్య గొడవలు లేకుండా సఖ్యంగా ఉన్నారా ?
3 . అసలు ద్రౌపది కురుసభకు రావాల్సిన పరిస్థితి కల్పించింది ధర్మరాజు ఆడిన జూదం వల్ల కాదా ?
4 . దైవంగా భావించే కృష్ణుడు మాట ని పాండవులే విన్నారు. వారి భార్యగా ఆమె కృష్ణుడు మాటకు విలువ ఇస్తే తప్పేంటి?
5 . ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మహాభారత యుద్ధం ఆమె వల్లే జరిగి 18 లక్షల మంది చనిపోయారనడానికి అసలు కారణం ఏంటి ? ద్రౌపది తనను అవమానించిన దుర్యోధన, దుశ్శాసనుల మీద ప్రతీకారం కోరుకుని ఉండొచ్చు కానీ మహా యుద్ధం చేయమని ఎప్పుడు ఎవరిని కోరింది ? ఆమె అలాంటి ప్రతీకార భావాలున్న వ్యక్తి అయితే తనకు పుట్టిన ఉపపాండవుల్ని అశ్వద్ధామ చాటుగా వచ్చి యుద్ధ నీతికి వ్యతిరేకంగా వధించాడని తెలిసి కూడా ప్రాణభిక్ష పెడుతుందా ? ఈ ప్రశ్నలకు రామ్ మాధవ్ లాంటి మేధావి ఏ సమాధానం ఇచ్చినా జనం దాన్ని నమ్మేదిగా ఉండాలి. ఏ విశ్వాసాల్ని పునాదిగా చేసుకుని బీజేపీ ఎదిగిందో అందులోనే తప్పులు పట్టే స్థితికి ఆ పార్టీ నాయకులు వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేదో ఓ వామపక్ష నేత అని ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఆరెస్సెస్ నేపధ్యం వున్న బీజేపీ నాయకుడు అనడం చూస్తుంటే అధికారం ఎలా , ఎంతలా పని చేస్తుందో అర్ధం అవుతుంది. రామ్ మాధవ్ కామెంట్స్ చూస్తుంటే పురాణాల్ని నమ్మండి కానీ అందులోను మాకు నచ్చింది, మేము మెచ్చింది మాత్రమే అనే స్థితికి అధికార బీజేపీ వచ్చినట్టు అనిపిస్తోంది .