మద్యానికి మొకమోసి పోయింది లోకం. ఎంతంటే.. ఎంత ఎండకొడుతున్న లెక్కచేయకుండా వడదెబ్బ తగులుద్దేమోనని చింతలేకుండా.. కరోనా సోకుతుందేమోనన్న భయం ఎంతమాత్రం లేకుండా క్యూనైన్లో నిలబడి మద్యం కోసం పాటుపడుతున్నారంటే చూస్తే నవ్వొస్తుంటుంది. అంతగా లోకం మద్యానికి బానిసైందా అని. ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధించింది కేంద్రం. అయితే లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ బంద్ పెట్టారు. సుమారు నెలన్నర నుంచి ప్రజలు ఓ రకంగా మద్యం మత్తుకు దూరంగా గడిపారనే చెప్పాలి. అది తాజాగా కేంద్రం సడలించిన కొన్ని నిబంధలనతో మద్యం షాపులు ఘనంగా తెరుచుకున్నాయి. అయితే తొలిసారిగా మద్యం షాపులు తెరుచుకోవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
వైన్స్ షాపుల ముందు.. జనాలంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. బుద్ధి మంతుల వలె మందుకోసం బారులు తీరి నిలుచోవడం చూస్తే నిజంగా మన భారత్ చెప్పిన మాట వినే దేశమనే చెప్పక తప్పదు. అయితే కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ ను గాలికి వదిలేసి ఒకర్నొకరు తోసుకుంటూ.. మాస్కులు, సానిటైజర్లు లాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం షాపుల దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. దీంతో.. తిరునాళ్లను తలపించాయి మద్యం షాపులు.. కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టి షాపులు ఓపెన్ చేశారు. మరికొన్ని చోట్ల బాణాసంచాల పేల్చి సంబరాలు చేసుకున్నారు.
అయితే నిన్న అంటే మద్యం షాపులు తెరిచిన తొలిరోజు మందు దొరికిన వాడి ముఖంలో ఎంతటి ఆనందం వెల్లివిరిసిందో చెప్పటానికి మాటలు చాలవు. ఒక్క బాటిల్ దొరికొతే చాలు అన్నట్టుగా మండుటెండను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి లైన్లలో నిలబడి.. ఒక్క బాటిల్ చేతిలో పడగానే ఎగిరి గంతేశారు. ఇక పలుచోట్ల తొక్కిసలాటలు, తోపులాటలు జరగడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పి.. మందుబాబులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో మద్యాన్ని తాగేశారు.. ఏపీ వ్యాప్తంగా మొత్తం 3,468 మద్యం షాపులు ఉండగా..
2,345 వైన్స్ షాపులను మాత్రమే తెరిచారు అధికారులు. నిన్న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం అందుతుంది. కాగా.. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా రోజూ రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే.. రాష్ట్రంలో రెడ్జోన్లు ఉండడంతో దాదాపు మూడో వంతు దుకాణాలు తెరుచుకోలేదు. అంతేకాకుండా మద్యం ధరలు కూడా పెరిగాయి.. దీంతో.. ఒకే రోజు రూ.60 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయని సమాచారం అందుతుంది.