హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఐదురోజుల క్రితం హత్యకు గురైన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ కేసులో పోలీసులకు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రాంప్రసాద్‌ను తానే చంపానని శ్యామ్ అనే వ్యక్తి అంగీకరించి పోలీసులకు లొంగిపోయినా అతడి వెనుక కోగంటి సత్యం ఉన్నాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాంప్రసాద్‌ను చంపేందుకు ఆయన ఏకంగా ఏడు టీమ్‌లు ఏర్పాటు చేశాడని, అందులో ఒక టీమ్ శ్యామ్, మరొక టీమ్ ప్రసాద్ అనే మరో అనుచరుడి ఆధ్వర్యంలో ప్లాన్ అమలు చేసేలా పక్కా పథకం రచించాడని పోలీసులు తెలిపారు. ఐదేళ్ల నుంచి తనను వేధిస్తున్న రాంప్రసాద్ బతికి ఉండకూడదని అనుచరులకు చెప్పిన సత్యం అతడిని హత్య చేయడాన్ని సమీపంలోని ఓ అపార్ట్మెంట్ నుంచి ప్రత్యక్షంగా చూసినట్లు పోలీసులు గుర్తి్ంచారు. అయితే ఈకేసు తనపైకి రాకుండా ఉండేందుకు అదేరోజు తాను తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లు వీడియోలు క్రియేట్ చేశాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తలపించేలా ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హత్యజరిగిన సమయంలో తాను తిరుపతిలో ఉన్నట్టుగా వీడియోలు సృష్టించాడు. అయితే టెక్నాలజీ ఆధారంగా ఆ రోజు రాంప్రసాద్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తేల్చారు. ఈ హత్యకేసుకు సంబంధించి స్కెచ్ వేసినవాళ్లు, హత్యలో పాల్గొన్నవారు రెండు నెలల నుంచి హైదరాబాద్‌లో మకాం వేసి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకులకు చెల్లింపులన్నీ కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ చేతుల మీదుగానే చేసినట్లు గుర్తిచారు. రాంప్రసాద్ హత్యకేసులో కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా బలమైన ఆధారాలు మాత్రం పోలీసులకు ఇంకా లభించలేదు. శ్యామ్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా తెలుగులో విజయవంతమైంది. హత్య చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా హీరో వెంకటేష్ పలు జాగ్రత్తలు తీసుకొంటాడు. ఆ మేరకు సాక్ష్యాలను కూడ సృష్టిస్తాడు. ఇదే తరహాలో వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కూడ కోగంటి సత్యం స్కెచ్ వేశాడు. కానీ, పోలీసుల ముందు సత్యం స్కెచ్ వర్కౌవుట్ కాలేదు. రాంప్రసాద్ హత్య జరిగిన సమయంలో కోగంటి సత్యం పంజాగుట్టలోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సత్యం ఉపయోగించిన ఫోన్ ఆధారంగా సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ద్వారా గుర్తించారు.