హెచ్ సీఏ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే అవినీతి కూపంలో మునిగిన ఇందులోంచి తాజాగా మరో వ్యవహారం బయటకు వచ్చి పెద్ద దుమారం రేపుతుంది. సాయం పేరుతో ఏకంగా ఎనభై లక్షలకు నామం పెట్టినట్టు తెలుస్తుంది. అసలే ఇప్పటికే ఎన్నో వివాదాలతో విమర్శలెదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా దొంగ లెక్కలు చూపి ఎనభై లక్షలు మింగేశారని సమాచారం అందుతుంది. మొత్తానికి ఇలాంటి వాటితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. మోస్ట్ కరప్షన్ అసోసియేషన్ గా పేరు తెచ్చుకుంది. రెండేళ్లకోసారి పాలకవర్గాల మారుతున్నాయి కానీ ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. అవినీతి ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు, అంతర్గత కుమ్ములాటలు చాలా సహజంగా మారాయి.
తాజాగా కరోనా పేరుతో ఏకంగా ఎనభై లక్షల అవినీతి జరిగిందన్నదని ప్రధాన విమర్శ. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో క్రికెట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. క్రికెట్ అసోసియేషన్ లు, క్రికెట్ క్లబ్బుల ఉపాధికి గండి పడింది. కోచ్ లు, గ్రౌండ్ మెన్, ఇతర సహాయ సిబ్బంది జీతాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో వారికి సహాయం చేసేందుకు ఒక్కో క్లబ్బుకు యాభై వేల చొప్పున వందకు పైగా ప్రైవేటు క్లబ్బులు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ లు మొత్తం కలిపి ఎనభై లక్షలు విడుదల చేశామన్నది హెచ్ సీఏ వాదన. అయితే సాయం పేరుతో నిధులు మింగేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్లబ్ కార్యదర్శి కూడా హెచ్ సీఏపై ఆధారపడి బ్రతకడం లేదని.. అంతటి దయనీయ స్థితిలో క్లబ్బులు లేవని హెచ్ సీఏ మాజీ ఉపాధ్యక్షుడు వెల్లడించారు.
కాగా ఉప్పల్ గ్రౌండ్ లో పని చేసే క్లర్కు లు, అంపైర్ లు, గ్రౌండ్ మెన్స్ ఇతర సిబ్బందికీ జీతాలు ఇవ్వని హెచసీఐ క్లబ్బులకు సాయం చేయడం హాస్యాస్పదమని.. ఇందులో కచ్చితంగా గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న క్లబ్బులో చాలా వరకు అకాడమీలకు లీజుకిచ్చి వున్నాయి. కొన్ని క్లబ్ లకు కోచ్ లు, మేనేజర్ లు, సహాయ సిబ్బంది లేరు. అలాంటప్పుడు హెచ్ సీఏ చేసిన సాయమంతా సెక్రటరీల జేబుల్లోకి వెళ్లాయని మరికొందరు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేసింది హెచ్ సిఎ పాలక వర్గం. సహాయంపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నామని చెప్తూనే.. సాయం అందుకున్న వారంతా ఫోన్లు చేసి కృతజ్ఞతలు కూడా చెప్పారని హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. మొత్తానికి సందర్భం ఏదైనా హెచ్ సీఏ మాత్రం ఏదో ఒక ఆరోపణతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.