అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది ఎన్నికల కమిషన్. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికలు జరిగి ఆపై నూతన అసెంబ్లీ ఏర్పడే వరకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఈ నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించింది.
ఆపద్ధర్మ సీఎంగా విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని, కొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని నియమావళిలో క్లారిటీ ఇచ్చింది. అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు వినియోగించినా నిబంధనల నియమావళి ఉల్లంఘన కిందకే రానుంది.సాధారణంగా అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి అమల్లో ఉంటుంది. కానీ, ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎటువంటి విధానం ఉంటుందో.. ఆ విధానాలన్నీ కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కనుక…కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్రంలోని అపద్ధర్మప్రభుత్వంగానీ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త విధివిధానాలు ప్రకటించడం గానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు.