ఈ ఏడాది జనవరి 11 తర్వాత ఏపీలో ఒక్క ఓటును కూడా తొలగించలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఫామ్ 7 దరఖాస్తు చేయగానే ఓటు తొలగించినట్టు కాదని ఫామ్ 7 అనేది ఓ దరఖాస్తు మాత్రమేనని దాన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్టు కాదన్నారు. ఆన్లైన్లో ధరఖాస్తులు చేయగానే ఓట్లను తొలగించబోరని తెలిపారు. అయితే నకిలీ అప్లికేషన్లపై పోలీసులు కేసులు పెట్టడం మొదలు పెట్టగానే దరఖాస్తులు రావడం ఆగపోయాయని ద్వివేదీ చెప్పారు. అదే సమయంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై రాజకీయ పార్టీల వైఖరి కూడా సరిగా లేదని ద్వివేదీ అభిప్రాయపడ్డారు.
ఓ వైపు ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చి ఫామ్ 7 మీద అభ్యంతరాలు చెబుతున్నారని.. మరోవైపు బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని ద్వివేదీ ఫైర్ అయ్యారు. ఓట్లు ఎక్కడ తొలగించారో విమర్శించే వారే నిరూపించాలని ద్వివేదీ సవాల్ చేశారు. ఏపీ రాష్ట్ర జనాభా నిష్పత్తితో పోలిస్తే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కు లేదని గుర్తించినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందన్నారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ద్వివేదీ స్పష్టం చేశారు. అయితే మరి తమ పార్టీల వోట్లు పోయాయని గగ్గోలు పెడుతున్న పార్టీలు దీనికి ఏమని సమాధానం చెబుతాయనేది ఆసక్తికరంగా మారింది.