లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులందరూ సీఈసీకి నివేదికలు సమర్పించినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోసం అవసరమైన పారా మిలటరీ బలగాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇటీవలే సీఈసీకి నివేదిక ఇచ్చింది. ఈసారి 5 దశల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నాలుగో వారంలో, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి మూడో వారంలో పూర్తి కానున్నాయి. వీటి షెడ్యుల్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో ఏ దశలో ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మొదటిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చి 3న వెలువడే అవకాశం ఉంది. మొదటిదశ మార్చి నాలుగో వారంలో ఎన్నిక జరగనుంది. మొత్తం ఐదు దశల్లో, 55 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసే విధంగా ఈసీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
ఈ లెక్కన ఐదు దశల పోలింగ్ ఏప్రిల్ చివరి వరకు పూర్తి చేస్తారు. మే మొదటి వారంలో ఓట్ల లెక్కింపు జరిగేలా.. షెడ్యూల్‌ను రూపొందించినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు పశ్చిమబెంగాల్, అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. దీంతో అన్ని ప్రధాన నిర్ణయాలను ఈ నెల 28లోగా అమలు చేయాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం తమకు సూచించినట్లు పలువురు కేంద్రమంత్రులు ఆఫ్ ది కెమెరా చెబుతున్నారు. మార్చి నుంచి ఎన్నికల నియమావళి వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వారు సంకేతాలిస్తున్నారు. దీంతో విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అన్ని పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించినట్లు కేంద్రమంత్రులు చెబుతున్నారు.