Election Updates: తెలంగాణలో 48 గంటల పాటు ఆ SMSలపై నిషేధం

Election Updates: Ban on those SMS for 48 hours in Telangana
Election Updates: Ban on those SMS for 48 hours in Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సైలెన్స్‌ పీరియడ్‌లో (నిశబ్ద వ్యవధిలో) కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమయంలో రాజకీయపరమైన, అభ్యంతరకర, బల్క్‌ SMSల ప్రసారంపై ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈనెల 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన SMSల ప్రసారాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా SMSలు పంపరాదని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి భారత శిక్షాస్మృతి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు పోలింగ్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.