ఇటీవలే జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే ఆ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందనే ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇవాళ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
బుధవారం జనసేనతో పొత్తుపై స్పష్టత వస్తుందని బీజేపీ కీలక నేత చెప్పినట్లు సమాచారం. ఇవాళ దిల్లీలో బీజేపీ అగ్రనేతలు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు ఇప్పటికే వ్యక్తపరచగా.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలసి ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించిన విషయం తెలిసిందే.