అవనిగడ్డ నుంచి తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బుద్ధప్రసాద్ సోమవారం కలిసి, పార్టీలో చేరనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు.
విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బుద్ధప్రసాద్ తో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్ కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్ కు జనసేన టికెట్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.