వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, ఆమ్ ఆద్మీ పార్టీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుల పోస్టులనూ తొలగించాలని సూచించింది.
ఈ పోస్టులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. మంగళవారం ఈ వివరాలను ఎక్స్ వెల్లడించింది. ఈ నెల 2, 3 తేదీల్లో ఈ ఆదేశాలు వచ్చాయని, ఆ తర్వాత 10వ తేదీన ఈమెయిల్ ద్వారా ఫాలోఅప్ చేశారని తెలిపింది. ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలను పోస్టుల్లో ఉంచవద్దని ఈసీ సూచించినట్లు వివరించింది.