హెరిటేజ్‌కు సంబంధించిన కీలక పత్రాల దహనం వీడియోలు చూసి తీవ్ర కలత చెందినట్లు ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ CIDకి హెరిటేజ్ లేఖ రాసింది. సీఐడీ అడిగిందని ఐఆర్ఆర్ కేసులో కీలక పత్రాలు ఇచ్చామని, కేసు విచారణలో సహకరించేందుకే ఇలా చేశామని పేర్కొంది. ‘‘న్యాయ ప్రక్రియలో ఇచ్చిన పత్రాల గోప్యత బాధ్యత సీఐడీదే. మా కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలున్నాయి. తాజా స్థితిగతులపై వివరణ ఇవ్వాలి. అప్పుడే పత్రాలు సురక్షితంగా, సీఐడీ రక్షణలో ఉన్నాయని నమ్ముతాం. తాజా పరిణామాలపై మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం’’ అని హెరిటేజ్ లేఖలో పేర్కొంది.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగులబెట్టడాన్ని స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది. సీఐడీ చీఫ్ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగులబెట్టినట్లు చెబుతున్నారు సిబ్బంది. హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు ఆరోపిస్తున్నారు తెదేపా నేతలు.