Election Updates: ఏపీలో బ్యాంకులకు జమ కాని నిధులు.. పింఛనుదారుల పడిగాపులు…

Election Updates: Funds not deposited in banks in AP.
Election Updates: Funds not deposited in banks in AP.

ఏపీ వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛనుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయాల సిబ్బంది తిరిగి చేరుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారులు సరిగా సమాచారం ఇవ్వకపోవడం, వైకాపా నేతల దుష్ప్రచారంతో ఉదయమే అక్కడికి చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వారికి నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు.

ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా ఖాతాలో జమకాలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఈ సాయంత్రానికైనా నిధులు వస్తాయో? లేదో? అనే పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారులు ఉద్దేశపూర్వకంగానే నగదు జమ ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనారోగ్యంతో ఉన్న వారు, దివ్యాంగులకు ఇంటికే వచ్చి పింఛను అందిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ అధికార పార్టీ నేతలు రాజకీయ లబ్ధికి యత్నించారు. రోగులు, వృద్ధులను మండుటెండలో మంచాలపై తరలించారు.