‘సీఎం జగన్కు, ఆయన కుటుంబానికి భద్రత పెంచుతున్నట్లు DGP 3నెలల క్రితం ప్రకటించారు. అయిదేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బస్సుయాత్ర పేరుతో బయటకు వస్తున్నారు. DGP చెప్పినట్లు భద్రతాపరమైన ముప్పు ఉంటే.. బస్సుయాత్రకు ఎలా అనుమతిస్తారు? ఒకవేళ ముప్పు లేకుంటే ఇప్పటివరకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి.. బస్సు ఎక్కాలి’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
‘బస్సుయాత్ర పేరుతో అయిదేళ్లలో మొదటిసారి ప్రజల్లోకి వస్తున్న జగన్ను స్వా గతిస్తున్నాం. ప్రధానమంత్రి 3హెలికాప్టర్లలో వస్తారు కాబట్టి.. తానేమీ తక్కువ కాదన్నట్లు 2 హెలికాప్టర్లు పెట్టుకుని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మొన్నటివరకు బారికేడ్లు, పరదాలమాటున ప్రయాణం చేసిన జగన్.. అదే బస్సుయాత్ర అలాగే చేస్తారా? అవి కట్టకుండా బస్సుయాత్ర చేస్తే, ఈ అయిదేళ్లలో ప్రజల మధ్యకు రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండు చేశారు. ఇప్పటికైనా రోడ్లపైకి వస్తున్న జగన్కు.. తన విధ్వంసపాలన చూసే అవకాశం ఏర్పడిందని రమణారెడ్డి అన్నారు.