వైకాపా అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పా రు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర క్రమశిక్షణతో ముస్లింలు రంజాన్ దీక్ష చేస్తారన్నారు. నిడదవోలులో వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు. రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు. ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.