తెదేపా, బీజేపీతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న జనసేన పార్టీ మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. అక్కడ కూడా అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ను కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి బరిలో నిలపనున్నారు. ఆయన 2రోజుల కిందటే పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వివిధ సమీకరణాలు, పేర్లు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం జరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి నిమ్మక జయకృష్ణను ఖరారు చేసినట్లు తెలిసింది.
ఆయన కూడా తాజాగా జనసేనలో చేరారు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరులో భాస్కరరావును అభ్యర్థిగా ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ఆయన్ను మార్చే అంశంపై జనసేన దృష్టి సారించినట్లు తెలిసింది. రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రూపానంద్రెడ్డికి సన్నిహితుడైన ముక్కావారిపల్లె సర్పంచి, తాజాగా జనసేనలో చేరిన అరవ శ్రీధర్ను ఆ స్థానంలో బరిలోకి దింపే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం . ఈ అభ్యర్థిత్వాల విషయం బుధవారానికి కొలిక్కి రావచ్చని తెలిసింది.