సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని కూనం వీరభద్రరావు గారి ప్రాణానికి ప్రమాదం ఉందని, ఆయన్ని ఖర్చు కింద రాసి… ఇతరుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు గారు ఆందోళన వ్యక్తం చేశారు. కూనం వీరభద్రరావు గారిపై మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్న వారు, తమతో నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాలని ఒత్తిడి చేస్తారన్నారు. వీరభద్రరావు గారికి సీబీఐ అధికారులు తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరారు. గతంలో మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారిని ఖర్చుగా రాసి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ నాయకులు బిటెక్ రవి గారు, బీజేపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారి ఖాతాలో జమ చేసే ప్రయత్నం చేశారన్నారు.
ఇప్పుడేమో వై.యస్. సునీతా రెడ్డి గారి భర్త చంపాడని కొత్త కథ మొదలుపెట్టారన్నారు. ఖర్చు వీళ్లు రాసి ఇతరుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని, ఇప్పుడు కూనం వీరభద్రరావు గారిని కూడా ఖర్చు చేసి, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలలో జమగా రాసే స్కీం వేసినట్లు అనిపిస్తోందన్నారు. ముందు చూపుతో తాను ఈ విషయాన్ని చెబుతున్నానని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జే బ్రాండ్లను పరీక్షించే వరకు మద్యపాన ప్రియులు మద్యం సేవించడం నిలిపివేయాలన్న రఘురామకృష్ణ రాజు గారు, జే బ్రాండ్లు చెత్త అయినా కిక్కు కోసం తాగుతున్నారన్నారు.