పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 65 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించనున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. జగన్మోహన్రెడ్డి వచ్చి ప్రచారం చేసినా.. పవన్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నూతన గృహప్రవేశం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మంగళవారం ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్ను ఓడించాలం మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి, ఒక్కటిగా చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. ‘నేను చట్టసభల్లో ఉంటా, అది లోక్సభ, శాసనసభ అనేది 48 గంటల్లో స్పష్టత వస్తుంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ ను కోరాను. విజయానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.’ అని తెలిపారు. హెరిటేజ్ పత్రాల దహనంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. జిరాక్స్ సరిగ్గా రాకపోతే కాల్చేశామంటూ పోలీసులు ఇచ్చిన వివరణ అర్థరహితంగా ఉందన్నారు.