జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనుండటంతో.. ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి వైకాపా అధిష్ఠానం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దొరబాబుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు.
అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న దొరబాబును సీఎం పిలిపించుకుని మాట్లాడి సర్దుబాటుకు ప్రయత్నించారు. ‘పవన్ పోటీ చేస్తున్నారు, ఈ సమయంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలి. మీరు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే పార్టీ నిలబడగలదు. పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేసి, పార్టీని నిలబెట్టండి’ అని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తన సీటు తనకు కేటాయించాలని గతంలోనే దొరబాబు కోరారు. ఇవ్వకపోవడంతో.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో కనీసం తన సామాజికవర్గం తరఫున రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనలను వేటినీ వైకాపా అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ముఖ్య మంత్రే స్వయంగా పిలిచి మాట్లాడటం గమనార్హం . సీఎంతో భేటీ తర్వాత దొరబాబు అక్కడే విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పిఠాపురంలో పవన్ కల్యా ణ్ను ఓడించాలని, వైకాపా అభ్యర్థి వంగా గీతను గెలిపించుకురావాలని నన్ను సీఎం ఆదేశిం చారు. అలాగే పని చేస్తానని ఆయనకు చెప్పా’ అని తెలిపారు.