రాష్ట్రంలో అయిదు లోక్సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, రాజమహేం ద్రవరం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలో దిగనున్నారు. దిల్లీలో సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలకు ఆమోదం తెలిపింది. అభ్యర్థుల జాబితాను షర్మిల ఇడుపులపాయలోని తన తండ్రి రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మంగళవారం విడుదల చేయనున్నారు.
కడప, కాకినాడ, బాపట్ల, రాజమహేంద్రవరం, కర్నూలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీకి 17 పేర్లు సిఫార్సు చేయగా ప్రస్తుతానికి అయిదుగురి పేర్లు ఖరారు చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. గత రెండు రోజులుగా షర్మిలతో పాటు సీనియర్ నేతలు దిల్లీలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.