కరోనా సమయంలో ఓ పూట కూరకు సాయం చేశారా ఎమ్మెల్యే. అంతమాత్రానికే దానకర్ణుడిలా బిల్డపివ్వడం మొదలుపెట్టారు. దొరికిన ప్రతి వేదికపై మైక్ పట్టుకొని సొంత డబ్బాను కొట్టుకోసాగారు. అది విని సాయం పొందిన వాళ్లూ విసిగిపోయారు. చివరికి ఆ గొప్పాలు ఆపండి బాబాయ్.. అంటూ నిరసన తెలియజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కరోనా సమయంలో ఓ రోజు ముస్లింలకు టమాటాలు, చికెన్ పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ప్రచారానికి వాడుకుంటున్నారు.
దీన్ని సాయం స్వీకరించిన ముస్లింలు అవమానకరంగా భావించి, మంగళవారం శ్రీకాళహస్తిలోని కుమారస్వామి తిప్పకూడలి వద్ద నిరసన చేపట్టారు. ఒక్క రోజు సాయం చేసి.. రాజకీయ వేదికలపై తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రోజూ చెప్పడం తగదన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి చికెన్ ఇవ్వడం తప్పా.. ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అయినా.. ఆపద వచ్చినప్పుడు సాయం చేయడం ఎమ్మెల్యే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. తమ వెంట తెచ్చుకున్న మాంసం, టమాటాను చెత్తకుప్పల్లో పడేశారు.