‘ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతని వ్యక్తిత్వం బయటపడుతుంది. జగన్ విషయంలో అదే జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రాజధానిగా చేశారు. వైజాగ్ పోర్టులోకి రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చాయంటే వైకాపా అనుమతి లేకుండా, కొంతమంది పోలీసుల సహకారం లేకుండా ఉంటుందా? యువతను మత్తులోకి దించుతున్న ఈ క్రిమినల్ ప్రభుత్వంను మీ అందరి మద్దతుతో NDA కూటమిగా రోడ్డుపైకి ఈడ్చి రాష్ట్ర సరిహద్దుల్లో పడేస్తాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయ యాత్రలో ఆయన మాట్లాడారు. ‘నా ఒక్కడి ప్రయోజనం కోసం రాలేదు. ఒక్క MLA కూడా లేకుండా పదేళ్లుగా రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. నాకు పదవి కావాలనుకుంటే ప్రధానిని అడిగితే ఎప్పుడో ఇచ్చేవారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలనే కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాం’ అని పవన్ తెలిపారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీగా భాజపా తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు పవన్ నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. అనకాపల్లి పట్టణం కిక్కిరిసిపోయింది.
జగన్ నాయకుడు కాదు..
‘‘అమ్మ ఒడి పథకం చదువుకునే పిల్లలందరికీ ఇస్తామని నమ్మించిన జగన్.. ఇంట్లో ఒకరికే ఇచ్చా రు. అందులోనూ ఏటా రూ.వెయ్యి చొప్పున కోత పెట్టారు. అమ్మఒడి కింద రూ.19,600 కోట్లు ఖర్చు పెట్టారు. మరి నాన్న గొంతులో సారా పోసి మద్యం వ్యాపారం మీద సంపాదించిన సొమ్ము రూ.లక్ష కోట్లపైనే ఉంది. ఇసుకను రూ.వేల కోట్లకు అమ్మేసుకున్నారు. జగన్ నాయకుడు కాదు, కమీషన్ వ్యాపారి. వైకాపా ప్రభుత్వం 56 సామాజిక కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసింది. వాటి ఛైర్మన్లకు కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. తెదేపా హయాంలో అనకాపల్లిలో కాపుల భవనానికి స్థలం కేటాయిస్తే ఈ వైకాపా వాళ్లు అక్కడ కార్యాలయం కట్టేసుకున్నారు. జగన్ ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. ఇక్కడి ప్రభుత్వ భూములను తనఖా పెట్టేసి, ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం అద్దె ఇళ్లలో నడుపున్నారు.