విశాఖలో విలువైన భూముల్ని వైకాపా నేతలు, అనుయాయులు, అనుకూల సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా దోచి పెడుతూనే ఉంది. ‘నా విద్యా సంస్థ విస్తరణ కోసం భూములు ఇవ్వండి’ అని ఇటీవల అనర్హత వేటుకు విశాఖ దక్షిణ వైకాపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కోరిందే తడవుగా అందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు అధికారుల నుంచి ఆఘమేఘాలపై సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. తన విద్యాసంస్థలను విస్తరించేందుకు 10 ఎకరాలను కేటాయించాలంటూ సీఎం అదనపు కార్యదర్శికి వాసుపల్లి కొద్దికాలం కిందట లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మూడుచోట్ల 6.90 ఎకరాల ఎకరాల విలువైన భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వా నికి అధికారుల నుంచి ప్రతిపాదనలు అందాయి.
విశాఖ పరిధిలో మూడు చోట్ల మార్కెట్లో రూ.80 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టేందుకు ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి. ఓ స్థలం కుసులవాడ స్థలం గ్రామ పంచాయతీ పరిధిలో కాగా, మిగిలిన రెండు స్థలాలు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. గణేష్‌కు చెందిన ‘వైజాగ్ డిఫెన్స్ అకాడమీ’కి కుసులవాడ చిన్న కొండలో స్థలం కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదించారు. సర్వే నంబరు 59లో 45.50 ఎకరాలు ఉండగా, దాన్ని సబ్‌డివిజన్ చేసి సర్వే నంబరు 287లో 5 ఎకరాలు ఇచ్చేందుకు సిఫారసు చేశారు. విశాఖ గ్రామీణ పరిధిలోని బక్కన్న పాలెంలో సర్వే నంబరు 107/4లో 1.23 ఎకరాలుండగా, దాన్ని సబ్ డివిజన్‌గా మార్పు చేసి 107/6లో 0.40సెంట్లు, మధురవాడ సర్వే నంబరు 3/1లో ఉన్న 32.22 ఎకరాల్లో సబ్ డివిజన్ చేసి 3/5లో 1.50 ఎకరాలు కేటాయించేలా ప్రతిపాదించారు. మధురవాడ ప్రతిపాదిత స్థలం వద్ద సర్వే నంబరు 3/6లో 0.19 సెంట్లను వాసుపల్లి స్థలం వద్ద రహదారికి ప్రతిపాదించడం గమనార్హం .