ఏపీలో ఈసారి ఎలాగైనా వైఎస్సార్సీపీని గద్దె దించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపత్యంలోనే మొదట జనసేనతో జత కట్టింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరి మరింత బలంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్రంలో తమ అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఆ పార్టీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది.
చివరి నిమిషంలో ఒకటి, రెండు స్థానాల్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్రాజుతో పాటు మరొకరి పేరు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి సురేష్, కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ), ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.