Election Updates: వివేకా కుమార్తె సునీత, ఆమె భర్తకు హైకోర్టులో ఊరట

Election Updates; Viveka's daughter Sunitha, her husband got relief in the High Court
Election Updates; Viveka's daughter Sunitha, her husband got relief in the High Court

పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీమంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని 4వారాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ యాంత్రిక ధోరణిలో పోలీసులకు పంపించారని ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది.

తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. 2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై కేసు నమోదు చేశారు. దీనిపై సునీత, రాజశేఖరరెడ్డి, ఎస్పీ రామ్సింగ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.