Election Updates: బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా?

Election Updates: What if the responsible officials are investigated?
Election Updates: What if the responsible officials are investigated?

‘ఏపీ సీఎం జగన్పై గులకరాయితో దాడి ఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఈ విషయంలో డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీసు కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేయించాలి. వాళ్లు తీసుకున్న భద్రతా చర్యలలో లోపాలు ఏంటనేవి తేలాలి. అందుకు ముందుగా వారిని బదిలీ చేసి సచ్ఛీలురైన అధికారులతో విచారణ జరిపించాలి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి ఎన్నికల సంఘానికి విన్న వించారు. ‘వీవీఐపీ కేటగిరీలో ఆ పాలకుడు ఉన్నందువల్లే కదా ఏ కార్యక్రమానికి వెళ్లినా పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్తు నిలిపివేసి చీకట్లో బస్సు యాత్ర చేయించారు. పరదాలు కట్టలేదు. చెట్లూ కొట్టలేదు’ అని పవన్ ప్రశ్నించారు. ఇటీవల మోదీ సభలోనే సెక్యూరిటీ పరమైన లోపాలు బయటపడ్డాయని.. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి పర్యటనకు వచ్చినప్పుడు ఇంతేస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తారని మండిపడ్డారు. వీరితో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని పవన్ నిలదీశారు. దీనిపై ఈసీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి సారించాలని కోరారు.