బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే 4సార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో సభలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పట్టనట్లు వ్యవహరించారు. ప్రధాని చెప్పినా వారి తీరు మారలేదు. మైకులకు సంబంధించి డీ గ్యాలరీ పక్కనే సిస్టమ్ ఏర్పాటు చేశారు. జనం ఒక్క సారిగా ముందుకు నెట్టుకువచ్చి .. మైకుల సిస్టంపై పడిపోవడంతో అవి మొరాయించాయి.
ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు స్పందించి వారిని నియంత్రించలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేదిక పైనుంచి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డికి పలుమార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మైకు మొరాయించడంపై ప్రధాని సైతం అసంతృప్తికి గురయ్యారు. అంతకుముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు ప్రసంగం సమయంలోనూ మైకులు కొంత సమయం పనిచేయలేదు. మైక్ సిస్టమ్‌కు రక్షణ కల్పించలేకపోవడం పూర్తిగా పోలీసుల వైఫల్య మేనని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మైకుల సిస్టం ఉన్న ప్రాంతంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు ఆరోపించారు.