Election Updates: బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా BRS ప్రకటిస్తుందా?

Election Updates: Will BRS announce BC, Dalit as CM candidate?
Election Updates: Will BRS announce BC, Dalit as CM candidate?

రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలయ్యాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​లు దూసుకెళ్తున్నాయి. ఇక కాస్త లేటుగా ప్రచారం షురూ చేసినా.. బీజేపీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్​లు జంట దొంగలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు బీసీ సీఎం హామీతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.

ఇందులో భాగంగా కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కరీంనగర్​లో పర్యటిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కమం గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్​లపై నిప్పులు చెరుగుతున్నారు.

కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ దారి మళ్లిస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్​కు అమ్ముడుపోతారని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల డీఎన్‌ఏల్లో బీసీ వ్యతిరేకత ఉందన్న సంజయ్‌.. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటిస్తుందా? అని ప్రశ్నించారు. పేదల గురించి మెుదటి నుంచి బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలు కాదని.. విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు.