Election Updates: కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీచేయనున్నారా..?

Election Updates: Sharmila will announce Congress list in Idupulapaya today
Election Updates: Sharmila will announce Congress list in Idupulapaya today

కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కడప నుంచి బరిలో దిగే అవకాశం ఉందని, కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో షర్మిల పేరు ఉండనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తారని, వారి విజయానికి షర్మిల సహకరిస్తారని ఇప్పటివరకు రాజకీయ వర్గాలు భావించాయి.

మరోవైపు సునీత పోటీ చేస్తే ఏకగ్రీవంగా మద్దతిస్తామంటూ ఈ నెల 15న కడపలో నిర్వహించిన వివేకా అయిదో వర్ధంతి కార్యక్రమంలో.. తెదేపా, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ప్రకటించారు.ఆ కార్యక్రమంలో షర్మిల క్రియాశీలకంగా వ్య వహరించారు. ‘‘వివేకాను హత్య చేసిన, చేయించిన వ్యక్తులను, వారిని కాపాడుతున్న వారిని ప్రజాకోర్టులో శిక్షించాలి. కోర్టులో న్యాయం జరగడం ఆలస్యం కావొచ్చు . ఇప్పుడు ప్రజాకోర్టులో వారందరికీ గుణపాఠం చెబుదాం ’’ అంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. సునీత పోరాటంలో అండగా ఉంటానన్నారు. అలాంటిది ప్రస్తుతం కడప నుంచి షర్మిల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.