ఎన్నికల్లో ప్రజలను మనసు మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా గెలుచుకుందాం అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్ద తాను ప్రమాణం చేస్తానని తెలిపారు. ఈ మేరకు గన్ పార్కు వద్దకు చేరుకున్న రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వాహనంలో గాంధీ భవన్‌కు తరలించారు.
రేవంత్ రెడ్డి అరెస్టుతో గన్ పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలోనే వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టయిన నేతల్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.