ఎన్నికల కోడ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా మద్యం, నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా.. నగదు అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తనిఖీల ద్వారా ఇప్పటి వరకూ పట్టుకున్న సొమ్ము 168 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో బంగారం, వెండి, నగదు ఉన్నాయని వెల్లడించారు.
అయితే పోలీసుల తనిఖీలు సామాన్యులకూ తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం ఏదైనా బయటపడితే సరైన పత్రాలు చూపించాలనిపోలీసులు హుకుం జారీ చేస్తున్నారని సామాన్యులు వాపోతున్నారు. సోదాల్లో పట్టుబడిన సొమ్ము పిల్లల ఫీజు కట్టేందుకు… లేదా పెళ్లి కోసం చీరలు, బంగారు కొనడానికి తీసుకెళ్తున్నామని చెప్పినా కొన్నిచోట్ల పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బులు తరలించేవాళ్లను, అక్రమ బంగారం వ్యాపారం చేసే వాళ్లను…T సామాన్యులను ఒకే తరహాలో చూస్తున్నారని అంటున్నారు. సరైన పత్రాలు చూపించకపోతే ఎన్నికల కోడ్ ప్రకారం స్వాధీనం చేసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్నారని.. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు.