తెలంగాణలో ఎన్నికల రణభేరి మోగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రియాంకా గాంధీ ములుగు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని తిరిగి దిల్లీకి పయనమవుతారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పర్యటిస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటూ తెలంగాణ ప్రజలతో మాట్లాడతారు.
రాహుల్ గాంధీ మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే..
-> రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
-> అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వెళ్లి.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుకు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారు.
-> సాయంత్రం 5 గంటలకు బస్సుయాత్రను ప్రారంభించి.. బస్సులోనే ములుగు సమీపంలోని రామాంజాపూర్‌కు చేరుకుని స్థానిక మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారు.
-> అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి.. రాహుల్‌గాంధీ భూపాలపల్లి వెళ్లి నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొని రాత్రి అక్కడే జెన్‌కో అతిథిగృహంలో రాహుల్, బస చేస్తారు. ప్రియాంక మాత్రం సభ పూర్తవ్వగానే తిరిగి దిల్లీకి పయనమవుతారు.
-> గురువారం (19న) ఉదయం భూపాలపల్లి నుంచి రాహుల్ మంథని వెళతారు. అక్కడ నిర్వహించే పాదయాత్రలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొని… మంథని నుంచి పెద్దపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం. రాత్రి 7గంటలకు కరీంనగర్‌లో చేపట్టే పాదయాత్రలో రాహుల్ పాల్గొని, రాత్రికి అక్కడే ఉంటారు.
-> శుక్రవారం (20న) బోధన్ వెళ్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులతో మాట్లాడిన.. అనంతరం ఆర్మూర్ వెళ్లి పసుపు రైతులతో మాట్లాడతారు.
-> అదేరోజు సాయంత్రం 4 గంటలకు అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి.. తర్వాత నిజామాబాద్ వెళ్లి పాదయాత్రలో పాల్గొనడంతో మూడ్రోజుల బస్సు యాత్ర ముగుస్తుంది.