Election Updates: నేటి నుంచి కాంగ్రెస్ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం

Election Updates: Congress changed Narayankhed candidate
Election Updates: Congress changed Narayankhed candidate

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించింది. ఇందు కోసం విజయభేరి బస్సు యాత్రను అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. మొదటి విడతలో రాహుల్ గాంధీ మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని కామారెడ్డి, ములుగు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో నిర్వహించిన విజయభేరి యాత్రలో పాల్గొన్నారు.

ఇక రెండో విడత విజయ భేరి బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి షురూ కానుంది. ఇవాళ తాండూరులో ప్రారంభం కానున్న ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఆరు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక రోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ యాత్రలో భాగంగా మొత్తం 17 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. ప్రజా సమస్యలు, భారాసను ఎండగట్టడం, క్యాడర్‌లో ఉత్సాహాన్ని పెంచే విధంగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస తెలిపింది. బస్సు యాత్రలో నేడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 30వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.