టీటీడీ లో అక్రమాలు అంటూ గళమెత్తిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకి అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఆయన ప్రశ్నలకు జవాబులు మాటేమో గానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ రమణ దీక్షితుల అక్రమాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకుముందే ఆయన ఆస్తుల చిట్టా సోషల్ మీడియాలో భలే షికార్లు కొట్టింది. అయితే అదేదో కష్టపడి సంపాదించుకున్నానులే అనుకున్నవాళ్ళు కూడా వున్నారు. తాజాగా ఆయన టీటీడీ నియమావళిని ఉల్లంఘించిన వైనం సాక్ష్యాలతో సహా బయటకు వచ్చింది. నాడు జగన్ అక్రమాస్తుల కేసులో పోరాటానికి టీడీపీ కి అవసరమైన సరంజామా సిద్ధం చేసిన చార్టెడ్ అకౌంటెంట్, 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ ఎల్లా శ్రీనివాస శేష సాయిబాబా రంగంలోకి దిగారు.
శ్రీవారి సేవలో వుంటూ ఇతర వ్యాపారాల్లో పాలుపంచుకోకూడదని టీటీడీ నియమావళిలో స్పష్టంగా వుంది. అయితే ఆ నిబంధనని ఉల్లంఘించి 2011 లో రమణదీక్షితులు ఓ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన పత్రాల నకలు ని సాయిబాబా బహిరంగపరచడమే కాదు… దీనిపై వ్యక్తిగత స్థాయిలో సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తాము చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అని చెప్పిన శేష సాయి ధైర్యముంటే అది అబద్ధం అని శ్రీవారి ధ్వజస్థంభం దగ్గర ప్రమాణం చేయాలని రమణ దీక్షితులకి సవాల్ విసిరారు. ఆ పత్రాల్లో రమణ దీక్షితులు సంతకంతో పాటు ఆయన తన వృత్తి ప్రధాన అర్చక అని నిర్దారించిన విషయంతో పాటు కొండ మీద ఆయన నివాసపు చిరునామా కూడా వుంది. ఈ పరిస్థితుల్లో రమణ దీక్షితులు శ్రీవారి ధ్వజస్థంభం ముందు ప్రమాణం చేసే ధైర్యం చేయకపోవచ్చు.
ఇక కాలం కలిసిరాక పోతే తాడే పాము అయి కరుస్తుందన్న మాట రమణదీక్షితుల విషయంలో అక్షరాలా సత్యం అవుతోంది. నిత్యం శ్రీవారి చెంత సేవ చేసుకునే భాగ్యం పొందిన రమణ దీక్షితులు ఎప్పుడైతే టీటీడీ కి వ్యతిరేకంగా నిందాపూర్వక ఆరోపణలు మొదలెట్టారో అప్పుడే బాడ్ టైం స్తార్ట్ అయిపోయింది. పూజారి పదవి మాత్రమే కాదు… ఇంట్లో పెంచుకున్న కుక్క వ్యవహారం కూడా వివాదం అయ్యింది. కొండ మీద కుక్కల్ని పెంచుకోవడం నిషిద్ధం. అయితే దేవదేవుడు సన్నిధిలో వుండే రమణదీక్షితులు మాత్రం తనకు ఈ నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు అనుకున్నారేమో. అందుకే ఇంటిలో ఓ కుక్కని పెంచుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టే పనిలోపడి రమణదీక్షితులు కొండకు వెళ్ళలేదు. దీంతో ఆయన గారు పెంచుకున్న కుక్క దిగులు పడింది. అసలు కొండ మీద కుక్క ని పెంచకూడదన్న నియమం కూడా బయటపడింది.