ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోవడం సంచలనంగా మారింది.. దీంతో రాత్రి నుంచి ప్రాజెక్టు నుంచి దిగువకు వృథాగా నీరు పోతున్నట్టు చెబుతున్నారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది.. అయితే, నీటి ఉధృతికిగేటు కొట్టుకుపోయింది.. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. నీరు వృథాగా కిందికి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 3వ నంబర్ గేటు కొట్టుకుపోవటంతో పూర్తిస్థాయిలో ఇప్పటివరకు మరమ్మతులు పూర్తికాకపోగా.. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో.. మరోగేటుకు అదే పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు..
అయితే, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని అధికార యంత్రాంగం సూచిస్తోంది.. ఇదే సమయంలో.. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు.. ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 2వ నంబర్ గేటును ఈ రోజు టీడీపీ నేతల బృందం పరశీలించనుంది.. టీడీపీ ఎమ్మెల్యే లు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలాబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ తదితర నేతలు ఈ రోజు గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు వెళ్లనున్నారు.