చాలా సాధారణంగా వచ్చే శారీరక సమస్యల్లో తలనొప్పి ఒకటి. నిద్రలేమి, పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూడటం, సరిపడా మంచినీళ్లు తాగకపోవడం వంటి కారణాలతో తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా చలికాలం వీచే చల్లని గాలులు కూడా తలనొప్పికి కారణం అవుతాయి. మాత్రలతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. కొన్ని తేలికైన చిట్కాలను పాటించడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. తలనొప్పి రావడానికి మంచినీళ్లు సరిగా తాగకపోవడం కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు. ఆల్కహాల్ అలవాటున్న వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి మద్యం సేవించే అలవాటుకు దూరంగా ఉండాలి. సరిపడా నిద్రలేకపోవడం వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ఫ్రభావం చూపుతుంది. తక్కువగా నిద్రించినా, నిద్ర ఎక్కువైనా తలనొప్పి వస్తుంది.
కాబట్టి సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా చాలా తలనొప్పులకు పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు తలనొప్పి వేధిస్తుంటే మంచి నీళ్లలో ధనియాలు, చక్కెర కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. గంధం చెక్కను అరగదీసి ఆ పేస్టును నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వెచ్చబెట్టి మర్దనా చేసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. యూకలిప్టస్ తైలంతో మర్దన చేసి తలనొప్పి తగ్గించుకోవచ్చు. తరచుగా తలనొప్పి బారిన పడేవారు వెన్న, చాక్లెట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.