మాది కోడి కత్తి పార్టీ అయితే మీది కట్టప్ప కత్తి పార్టీ…!

YSRCP MLA Kodali Nani Salms Chandrababu

చంద్రబాబు అంటేనే ఇంతెత్తున లేచే కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, ఈరోజు మరో మారు చంద్రబాబు మీద విరుచుకు పడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో కలవాలని చంద్రబాబు ఇటీవల చెప్పడంపై నాని వ్యంగ్యంగా స్పందించారు. ఓవైపు పవన్ కల్యాణ్ రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబును అమ్మనా బూతులు తిడుతుంటే, ఆయన మాత్రం ‘పవన్ నాతో కలిసి రావాలి’ అంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని కోడి కత్తి పార్టీ అంటున్నారని మాది కోడి కత్తి పార్టీ అయితే మీది కట్టప్ప కత్తి పార్టీనా ? వెనకాల నుంచి నువ్వు పొడిచేస్తావా ?’ అంటూ ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు.

ఎవరో ఒకరి సంక నాకాలి, ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం 40 ఏళ్లు అయితే జగన్ వయసు 40 సంవత్సరాలని గుర్తుచేశారు. దమ్మున్న నాయకుడు కాబట్టే జగన్ పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడని, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసిన వారితో జగన్ ను విమర్శిస్తూ లేఖ రాయించారని విమర్శించారు. ‘ఈ పోటుగాళ్లు సంవత్సరానికి 365 రోజులు అసెంబ్లీకి పోతున్నారా? బడ్జెట్ సెషన్ ఓ 20 రోజులు, శీతాకాల, వర్షాకాల సమావేశాలు మరో 10 రోజులు అన్నీ కలిపి గట్టిగా 30 రోజులు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారని వ్యాఖ్యానించారు.