స్ట్రాంగ్ రూమ్ ల నుండి ఈవీఎంల తరలింపు…అసలు విషయం ఇదట ?

ఏపీలో భారీ ఉత్కంఠ నడుమ ముగిసిన ఎన్నికలు.. ఆ తర్వాత కూడా వరుసగా పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా స్ట్రాంగ్ రూమ్ లను తెరిచి ఈవీఎం లను తరలించిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. పోలింగ్ బుతుల్లో గొడవలు చేసి ఓటింగ్ ఆపాలని చేసిన కుట్రలు విఫలం కావడంతో ఇక ఈవీఎంలు మార్చే పనిలో విపక్ష నేతలు బిజీగా ఉన్నారా? ఎన్నికల్లో ప్రజా మద్దతును మార్చలేని నేతలు ఇప్పుడు ఈవీఎంలు మార్చే పనిలో ఉన్నారా? అనే కోణంలో అనుమానాలు మొదలయ్యాయి. మే 23వ తేదీ తెరుచుకోవాల్సిన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను శనివారం రాత్రి 10 గంటల సమయంలో తెరిచారు. అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా వర్సిటీలో భద్రపరిచారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం శుక్రవారం కలెక్టర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేశారు. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా… ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్‌తోపాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే, శనివారం రాత్రి కలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఈవీఎంలను తరలించడం రాష్ట్రంలోని అన్ని రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారింది. అయితే ఈరోజు ఉదయం కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్, నియోజకవర్గగాల రిటర్నింగ్ అధికారులు, రాజకీయపార్టీల అభ్యర్థులు ఈ. వి.ఎం.లు భద్రపరిచిన కృష్ణా యూనివర్సిటీకు పరిశీలన నిమిత్తం చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తరలించినవన్ని రిజర్వ్ ఈవియంలని, బందర్ మార్కెట్ యార్డ్ లోని గోడౌన్ లో భద్రపరిచామని, మీడియాలో వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులను పిలిపించామన్నారు. పూర్తి స్థాయిలో వారికి నిజనిర్ధారణ చేశామన్నారు. సెక్యూరిటీ పరంగా ఎటువంటి వీడియోలు, ఫోటోలు తీయకూడదని హెచ్చరించినా వీడియో తీసి ఎన్నికల నిమిత్తం డ్యూటీకి నియమించబడ్డ వీడియో గ్రాఫర్ వీడియో లీక్ చేశాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని నూజివీడు రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీచేశారు.