Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పటి హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి,అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల,ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి.
3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు.
నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం, నానా అరాచకాలు సృష్టించారు. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది.
రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948న భారత్ యూనియన్లో విలీనం చేసుకుంది.