టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాన్వాయ్ లోని ఎస్యూవీ వాహనం ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పరిగి సీఐ మొగిలయ్య తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహేందర్ రెడ్డి 8.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన కాన్వాయ్‌లోని పైలట్ వాహనం యెంకలపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ (AP 12 C 9210)ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న వ్యక్తి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఆ వ్యక్తి ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఊపిరి ఉందని భావించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు పేర్కొన్నారు.
చనిపోయింది మైలారం దేవరంపల్లికి చెందిన మెకానిక్ మహిపాల్ రెడ్డిగా గుర్తించారు. యాక్సిడెంట్‌లో వ్యక్తి చనిపోయాడన్న సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనాన్ని నడిపిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కన్వాయ్‌లోని వాహనాన్ని పోలీసులు దాచిపెట్టారని, తర్వాత మృతుడి బంధువుల ఆందోళనలతో చివరకు పోలీస్ స్టేషన్‌కు తరలించారని సమాచారం. ఆ తదుపరి ఆయన్ని జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు పంపగా ఎదురు వస్తున్న వాహనాల వెలుగు కళ్ళలో పడడంతో తనకి ఆ సమయంలో ఎటువంటి వాహనం కనపడలేదని అందువల్లనే ఆ వాహనం కనపడలేదని పేర్కొన్నారు. అయితే ఆ వాహనం మంత్రి కాన్వాయ్ లో రోడ్ క్లియరెన్స్ పార్టీ కి చెందినది అని తెలుస్తోంది.