జిమ్ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న మహిళ అతడితో కలిసి భర్తను అంతమొందించేందుకు వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జులై 23న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్‌గా పనిచేసే రాజీవ్ వర్మ మీద కాల్పులు జరిగిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.
భర్తపై హత్యా యత్నం కేసులో భార్యతో పాటు జిమ్ ట్రైనర్‌గా పనిచేసే ప్రియుడు, మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్మను అంతమొందించే లక్ష్యంతో ఆయనపై నిందితులు కాల్పులు జరిపి పారిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని వైద్యులు కాపాడారు.
సూరజ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రేటర్ నోయిడాలోని సఖీపూర్ వద్ద ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. గత ఏడాదిగా వర్మ భార్య శిఖాతో తనకు వివాహేతర సంబంధం ఉందని నిందితుడు రోహిత్ కశ్యప్ ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు.
జిమ్‌లో వారి మధ్య ఏర్పడిన పరిచయం అనైతిక సంబంధానికి దారితీసిందని, భర్త అడ్డు తొలగించేందుకు ఆయనను హతమార్చాలని రోహిత్‌ను శిఖా కోరిందని పోలీసులు తెలిపారు.
హత్య ప్రణాళికను పకడ్బందీగా అమలుచేసేందుకు శిఖా సూచనతో రూ 1.2 లక్షలకు రోహన్ కుమార్ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో రోహిత్ ఒప్పందం చేసుకున్నాడు. వీరు ముగ్గురూ జులై 23న వర్మను చంపే ఉద్దేశంతో ఆయనపై కాల్పులు జరపి ఘటనా ప్రాంత నుంచి పరారయ్యారని పోలీసులు చెప్పారు.