ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియా సంస్థలు తమ సేవలను వంద శాతం పునరుద్దరించినట్లు ప్రకటించాయి. ఎఫ్‌బీ, వాట్సాప్, ఇన్‌స్టాలకు బుధవారం రాత్రి నుంచి అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందిపడ్డారు. ఇమేజ్ మెసేజ్‌లు ఓపెన్ కాలేదు. వీడియోలు కూడా ప్లేకాలేదు. దీంతో సోషల్ మీడియా యూజర్లు హైరానా పడ్డారు. భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాల్లో ఈ సమస్య ఎదురైంది. వాట్సాప్‌లో రాత్రంతా ఇదే సమస్య కొనసాగింది. ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు పంపిడం వీలుకాలేదు. భారత్‌లో కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రం వెళ్లాయి. ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎదురైనట్లు డౌన్‌డిటెక్టర్‌డాట్‌కామ్ పేర్కొన్నది. అయితే ఆ సమస్యలన్నీ తీరినట్లు ఫేస్‌బుక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. కొందరు యూజర్లు ఇంకా సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాష్‌ట్యాగ్ పేజీలు ఇంకా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రొటీన్‌గా నిర్వహించే మెయిన్‌టెన్స్ సమయంలో కొందరు యూజర్లకు అప్‌లోడ్ సమస్య ఎదురైనట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.