ఫేస్ బుక్కయ్యాడు…!

Facebook Friendship Kept A Guy Under Bars

ఫేస్‌బుక్‌లో పెంచుకున్న స్నేహాన్ని చేతకాని తనంగా తీసుకుని ఒక వివాహితను, ఆమె భర్తను బెదిరిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన వివాహిత 2017లో ఫేస్‌బుక్‌లో ఓ జీలన్ నోయెల్ పేరుతో ఒక ఖాతా కనపడంతో అది గాయకుడు నోయెల్ అని భావించిన ఆమె మెసేజ్ చేసారు. అయితే తాను గాయకుడు నోయల్‌ కాదని.. అనంతపురానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి జీలన్‌ నోయల్‌ అంటూ చాట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌గా ఉందామని కోరడంతో ఇద్దరు ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ ద్వారా చాట్‌ చేసుకున్నారు. ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

facebook-cybercrime
అలా ఇద్దరి మధ్య చాటింగ్‌లు పెరిగిపోవడంతో జీలన్‌ కొన్నిసార్లు హైదరాబాద్‌కు వచ్చి ఆమెకు కలిశాడు. ఆ క్రమంలో ఆమె వ్యక్తిగత చిత్రాలను సేకరించాడు. అలా కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వ్యక్తిగత కారాణాల వల్ల ఆమె కొంతకాలం నుంచి అతడితో చాటింగ్‌ చేయడం ఫోన్‌కు జవాబివ్వడం మానేసింది. దీంతో కక్ష పెంచుకున్న జీలన్‌.. ఆమె సెల్‌ఫోన్‌కు అభ్యంతరకర సందేశాల్ని పంపించడం ఆరంభించాడు. అయినా స్పందన లేకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఆమె తనతో మాట్లాడకుంటే ఆమె చిత్రాల్ని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించడం కొనసాగించాడు. ఈ క్రమంలో బాధితురాలు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జలేంధర్‌రెడ్డి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించి అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసరాల్లోని ఎల్లనూరులో పట్టుకున్నారు. నిందితుడు తప్పు చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్‌ చేసి అతడి నుండి రెండు ఫోన్లు సీజ్‌ చేశారు.

facebook-arrest