ఫేక్ బుక్ ఫేస్ లెస్ ప్రేమ…సెక్యూరిటీ గార్డ్ బలి

faceless fakebook love

ఫేక్ ఫేస్‌ బుక్ ప్రేమకు ఓ యువకుడు బలయ్యాడు. తన ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం  అసోంకు చెందిన బిద్యుత్‌ సైకియా(24) మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తనకు సోదరుడి వరుసైన ప్రమోద్ సైకియా, దీపెన్ సైకియాలతో కలిసి రాయదుర్గం మధురానగర్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి మిగతా ఇద్దరూ విధులకు వెళ్లగా, బిద్యుత్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. విధులకు వెళ్లిన వారు ఉదయం తిరిగి రాగా,  తలుపు గడియపెట్టి ఉంది. ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపలి దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. మణికట్టు వద్ద కత్తిగాటు చేసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయితో గత కొంతకాలంగా బిద్యుత్ ప్రేమలో ఉన్నాడని, ఆ అమ్మాయి పెళ్లికి ఆమె నిరాకరించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ప్రమోద్ పోలీసులకు తెలిపాడు.