నితిన్ సినిమాలో నటించాలంటే మూడు లక్షల ఫీజ్ అట !

Fake Casting Call For Nithin Bhishma

‘ఛలో’ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల తదుపరి సినిమా నితిన్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాకి నిర్మాతలు. అయితే నితిన్ రాబోయే చిత్రంలో ఏదో ఒక పాత్రలో మీరు కనిపించాలనుకుంటున్నారా? అయితే 3 లక్షలు కడితే చాలు మీ కలను మేము నెరవేరుస్తామంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ప్రత్యక్షమైంది. రోజురోజుకి ఈ గ్రూపులో సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ గ్రూప్ విషయం సినిమా టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ యూనిట్ స్పందించక తప్పలేదు. తాజాగా ఈ విషయం మీద దర్శకుడు వెంకీ కుడుముల స్పందిస్తూ డబ్బు కడితే నితిన్ ‘భీష్మ’ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఆ వాట్సాప్ గ్రూపుకి ఈ సినిమా యూనిట్ కి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎవరైనా కొత్తవాళ్లు అవసరమైతే యూనిట్ నుంచి కాస్టింగ్ కాల్ వస్తుంది. అంతేగానీ, మధ్యవర్తులను నమ్మేసి మోసపోవద్దని స్పష్టం చేశాడు.