పళ్లిపట్టులో ఆసుపత్రి నిర్వహిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ దంపతులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో డెంగీ వ్యాప్తి చెందడంతో వందలాది మంది జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలకు బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ వైద్యులను సంప్రదించి చికిత్స పొందడంతోనే జ్వరాల బారినపడిన బాధితుల ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. దీంతో నకిలీ వైద్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు వీలుగా జిల్లా ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దయాళన్ అధ్యక్షతన ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇంత వరకూ పళ్లిపట్టు, తిరుత్తణి సహా జిల్లాలో ఆరుగురు నకిలీ వైద్యులను ఆరోగ్యశాఖ అధికారుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పళ్లిపట్టులోని నగరి రోడ్డు మార్గంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి చీఫ్ డాక్టర్ కావలన్ అధ్యక్షతన మండల వైద్యాధికారి ధనుంజయన్ తదితరుల బృందం తనిఖీ చేపట్టగా మురళి (42) అనే వ్యక్తి పదో తరగతి చదవగా, అతని భార్య క్రాంతి(35) ఉపాధ్యాయ శిక్షణ పొందింది. ఈ దంపతులు రోగులకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, మందులు స్వాధీనం చేసి దంపతులను పోలీసులకు అప్పగించారు. పళ్లిపట్టు పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ డాక్లర్లను అరెస్ట్ చేశారు.