విలేకరినంటూ దాదాగిరి… ఆపై మహిళ కటకటాల వెనక్కి

యూట్యూబ్ విలేకరినంటూ రేషన్ డీలర్‌ వద్దకు వచ్చిన మహిళ అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. విలేకరి పేరుతో రేషన్ డీలర్‌ను బెదిరించిన మహిళ కటకటాల పాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో పాత పురపాలక సంఘం కార్యాలయం వెనుక అడుసుమిల్లి అనూష రేషన్‌ దుకాణం నడుపుతున్నారు. సోమవారం ఎగ్గేపల్లి అనిత అనే ఆమె అక్కడకు వచ్చి  తాను యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరినంటూ పరిచయం చేసుకొని డబ్బులు ఇవ్వమంటూ బెదిపింపులకు దిగింది. అయితే రేషన్ దుకాణం వద్ద వీడియో, ఫొటోలు తీసింది. అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలని అనూషను డిమాండ్ చేసింది. నీకు డబ్బులు ఎందుకివ్వాలంటూ ఆమె ప్రశ్నించగా ఆ మహిళ బ్లాక్‌మెయిల్‌కు దిగింది.

అదేమంటూ మీ రేషన్ షాపులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని.. మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించింది. అంతటితోఆగకుండా నిన్ను కేసులో ఇరికించేస్తా అంటూ బెదిరించింది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదని.. డబ్బులు ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అనూష్ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ ఆ మహిళ బెదిరింపులకు పాల్పడటంతో అనూష్ జంగారెడ్డి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.