కుటుంబ కలాహాలు…రాజకీయ రంగు….వివస్త్రని చేసి మరీ కొట్టారు !

family feuds-political colour

కుటుంబ, రాజకీయ కలహాలతో ఓ మహిళ స్వయానా తోడికోడలి మీద అనుచితంగా దాడి చేయడంతో ఆమె తనువు చాలించింది. పది మందితో కలిసి ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి వివస్త్రను చేసి విచక్షణా రహితంగా దాడి చేసింది. అడ్డొచ్చిన భర్త, పిల్లలపైనా దాడికి పాల్పడటంతో బాధితురాలు ఆ దారుణాన్ని మౌనంగా భరించింది. తర్వాత అవమాన భారం తట్టుకోలేక తనువు చాలించింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలో జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన బ్రహ్మయ్య, ఆయన భార్య టీడీపీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మయ్యకు తన ముగ్గురు అన్నదమ్ములతో కుటుంబ కలహాలు ఉన్నాయి. దీనికి తోడు ఆ ముగ్గురు వైసీపీలో ఉండటంతో కలహాలు కొనసాగుతున్నాయి. తోడికోడళ్ల మధ్య కూడా సఖ్యత లేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బ్రహ్మయ్య దంపతులు బైక్‌పై వెళ్తుండగా పద్మ కాలు తోడికోడలు పాపమ్మకు తగిలింది. పద్మ కావాలనే తనకు కాలు తగిలించిందని భావించిన పాపమ్మ మంగళవారం పది మందిని వెంటేసుకుని బ్రహ్మయ్య ఇంటికి వచ్చింది. పద్మను ఇంటి నుంచి వీధిలోకి లాగి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. కాళ్లతో తన్నుతూ పద్మ బట్టలన్నీ చించేసి వివస్త్రను చేసింది. భార్యపై జరుగుతున్న దాడిని ఆపేందుకు వచ్చిన బ్రహ్మయ్యను వచ్చిన వారు చితకబాదారు. భర్త చూస్తుండగానే పద్మపై దాష్టీకం ప్రదర్శించిన పాపమ్మ కొద్దిసేపటి తర్వాత శాంతించి తిరిగి వెళ్లిపోయింది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన పద్మ ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన భర్త, స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లేసరికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో వెంటనే గ్రామంలోని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు ఆయన చెప్పారు. తన భార్యపై జరిగిన దాడికి సంబంధించి బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజకీయ రంగుపులుం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు పరామర్శించారు.