Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ప్రముఖుల జీవితగాధలను వెండితెరకెక్కించేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇప్పటిదాకా క్రీడాకారులు, సినీ ప్రముఖుల జీవితాలనే తెరకెక్కిస్తున్న బాలీవుడ్ ఇప్పుడు ఓ శాస్త్రవేత్త జీవితంపై దృష్టిపెట్టింది. ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్ జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ ప్రయత్నాలు చేస్తున్నారు.
మంగళ్ యాన్ మిషన్ బృందంతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ దిగిన ఫొటోను చూసిన నిఖిల్ అద్వానీకి రాధాకృష్ణన్ గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో రాధాకృష్ణన్ రాసిన మై ఒడిస్సీ పుస్తకాన్ని ఆయన చదివారు. ఆ పుస్తకం నిఖిల్ అద్వానీకి ఎంతగానో నచ్చింది. దీంతో రాధాకృష్ణన్ పై సినిమా తీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రాధాకృష్ణన్ కూడా ధృవీకరించారు.
ఓ కుగ్రామం నుంచి వచ్చిన తాను చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, నేటి యువత తనను ఆదర్శంగా తీసుకోవాలని రాధాకృష్ణన్ సూచించారు. తన జీవితం ఏంటో తెలిస్తే యువతలో మార్పు వస్తుందని… అందుకే బయోపిక్ తీస్తానంటే ఒప్పుకున్నానని ఆయన తెలిపారు. ఎమ్మె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.